పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వేలెత్తి చూపకుండా వారిని వేలు పట్టుకుని నడిపించటం ద్వారా సరైన దిశానిర్దేశం చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సూచిం చారు. పిల్లలు వివిధ అంశాల్లో రాణించినప్పుడు మెచ్చుకోవటం, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసించటం ద్వారా వారి భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఎదుగుతున్న పిల్లల శారీరక, మానసిక సమస్యల్ని అర్థం చేసుకోవటం, పరిష్కార మార్గాల్ని చూపటం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్నారు. 'పిల్లల భవిష్యత్తు- తల్లిదండ్రుల బాధ్యత' అనే అంశంపై హైదరా బాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బివి పట్టాభిరామ్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ గతంలో సైకియాట్రిస్టుల వద్దకు ప్రేమలో వైఫల్యాలు, భార్యాభర్తల విడాకుల కేసులు, వరకట్న వేధింపుల్లాంటి కేసులు ఎక్కువగా వచ్చేవని, అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మనస్పర్థలు పెరగటం, వారి మధ్య సంబం ధాలు దెబ్బతిని అగాధం పెరిగిపోవటంలాంటి కేసులు 70 శాతం వరకూ వస్తున్నాయని చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ పిల్లల్ని సహజంగా పెరగనీయకపోవటం వల్ల వారిలో సున్నితత్వం దెబ్బ తింటోందని పట్టాభిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు.